తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం: ఏఆర్ డెయిరీ ఎండీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

  • ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్
  • కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అంశానికి సంబంధించి విచారణకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
  • ఈ క్రమంలో హైకోర్టులో రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే అభియోగంపై తమిళనాడు దిండిగల్ కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ రాజశేఖరన్ పై టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. 

అయితే లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ అంశానికి సంబంధించి సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకు సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీస్ అధికారులు, ఒకరు ఎస్ఎఫ్ఎల్ నిపుణుడితో కూడిన కమిటీ విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.


More Telugu News