శ్రీవారికి ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించింది: సీఎం చంద్రబాబు

  • తిరుమలలో వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
  • ఇక్కడ గోవింద నామస్మరణ తప్ప మరేమీ ఉండకూడదని స్పష్టీకరణ 
తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉండే హిందువులందరికీ అభినందనలు తెలిపారు. ఈ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. 

ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయని, స్వామివారు వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతారని చంద్రబాబు వివరించారు. వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక పవిత్రభావంతో వీక్షిస్తారని పేర్కొన్నారు. 

కలియుగ దేవుడు, ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం వెంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక పర్యాయాలు పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు తిరుమల వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపడుతోందని అభినందించారు. ఇక్కడ గోవింద నామస్మరణ తప్ప మరేమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News