ఒక్కరే వచ్చి తిరుమల నిబంధనలను జగన్ తుంగలో తొక్కారు: కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ

  •  తిరుమల లడ్డూపై సుప్రీం తీర్పు 
  • తీర్పును స్వాగతిస్తున్నామన్న శ్రీనివాసవర్మ
  • శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నమ్ముతున్నామని వెల్లడి
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డూ కల్తీపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురితో కమిటీ వేసిందని, లడ్డూ వివాదంపై వాస్తవాలు బయటపెట్టాలని ఆదేశించిందని అన్నారు. 

జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని శ్రీనివాసవర్మ ఆరోపించారు. నాడు రథం తగలబెట్టినా, రాముడి విగ్రహం తల తొలగించినా చర్యలు లేవని వ్యాఖ్యానించారు. 

తిరుమలలో నిబంధనలను జగనే తుంగలో తొక్కారని మండిపడ్డారు. దంపతులు వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని నిబంధనలు ఉన్నాయని, కానీ అర్ధాంగి లేకుండా జగన్ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారని శ్రీనివాసవర్మ విమర్శించారు. తద్వారా శాస్త్ర విరుద్ధంగా, ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆక్షేపించారు. 

జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు. కమిటీ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.


More Telugu News