400 కోట్ల కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పుత్రరత్నం.. ఖరీదైన కారులో తిరుగుతూ తండ్రి కోసం ఎన్నికల ప్రచారం!

  • మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సికందర్
  • అనారోగ్యం సాకుతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరిక
  • అక్కడి నుంచి ప్రతిరోజూ బయటకు వస్తూ ఖరీదైన కారులో చక్కర్లు
  • ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు
  • సీసీటీవీ ఫుటీజీలు పరిశీలిస్తున్న ఈడీ
చట్టం అందరికీ ఒకటే కాదని మరోమారు రుజువైంది. రూ. 400 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్ కుమారుడు సికందర్ ఫ్యాన్సీ కారులో హర్యానా రోడ్లపై తిరుగుతూ కనిపించడం దుమారం రేపుతోంది. అనారోగ్యం సాకుతో ఆసుపత్రిలో చేరి ఆపై అక్కడి నుంచి బయటకు వచ్చి తండ్రి కోసం ఎన్నికల ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. ఖరీదైన కారులో తిరుగుతూ, సెల్‌ఫోన్ వాడుతూ బయట రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రూ. 400 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై సికందర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అనారోగ్యం కారణంగా జైలు నుంచి రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడతడికి కాపలాగా ఉండాల్సిన పోలీసులు అడ్రస్ లేకుండా పోయారు. ప్రతిరోజూ దర్జాగా ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి హర్యానా వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అతడి వద్ద ఫోన్ కూడా అందుబాటులో ఉంది. హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాడు. రూ. 400 కోట్ల కుంభకోణంలో  ఎమ్మెల్యే ధరమ్‌సింగ్, ఆయన కుమారుడు సికందర్ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. ఇద్దరిపైనా ఈడీ కేసు నమోదు చేసింది. 

ఎమ్మెల్యే చోకర్‌కు హర్యానా-పంజాబ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు, సికందర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాతి నుంచి అతడు అనారోగ్య కారణంతో జైలు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బెయిులు తిరస్కరణకు గురయ్యాకు రెండుసార్లు పీజీఐ ఆసుపత్రిలో చేరాడు. 

అక్కడ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ తండ్రి కోసం ప్రచారం చేస్తున్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక ఫార్చ్యూనర్ కారును నడిపాడని, ఒక హోటల్‌లో నిద్రపోయాడని, పార్టీ కూడా చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ వార్తలతో అప్రమత్తమైన ఈడీ సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తోంది.


More Telugu News