పాండ్యా బౌలింగ్ ప‌ట్ల మోర్కెల్ అసంతృప్తి.. నెట్స్‌లో తీవ్రమైన చర్చ.. అస‌లేం జ‌రిగిందంటే..!

  • ఎల్లుండి నుంచి బంగ్లాతో 3 మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌
  • గ్వాలియర్‌లో నెట్ సెషన్‌లో చెమ‌టోడ్చిన భార‌త ప్లేయ‌ర్లు
  • మోర్కెల్‌కి న‌చ్చ‌ని పాండ్యా బౌలింగ్ స్ట్రాటజీ
  • చేతి నుంచి బాల్‌ విడుదల చేసే పాయింట్‌పై కూడా ఇరువురి చ‌ర్చ‌
తాజాగా బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20ల కోసం సిద్ధ‌మ‌వుతోంది. ఈ ఆదివారం నుంచి మూడు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్ జరగనుంది. దీనిలో భాగంగా భార‌త ప్లేయ‌ర్లు గ్వాలియర్‌లో జరిగిన నెట్ సెషన్‌లో చెమ‌టోడ్చారు. 

ఇక చాలా గ్యాప్ త‌ర్వాత‌ జ‌ట్టుతో చేరిన‌ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా బౌలింగ్‌ ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. అయితే, హార్దిక్ బౌలింగ్‌ తీరుపై కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో అత‌ని బౌలింగ్‌లో చేయవలసిన దిద్దుబాట్లపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించిన‌ట్లు తెలుస్తోంది. 

హార్దిక్ స్టంప్‌లకు చాలా దగ్గరగా బంతులు విస‌ర‌డం మోర్కెల్‌కి న‌చ్చ‌లేద‌ని, ఈ శైలిని కొంచెం మార్చుకుంటే బాగుటుంద‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. అలాగే హ‌ర్దిక్ రన్-అప్‌పై కూడా కీల‌క సూచ‌న‌లు చేశాడ‌ట‌. దీంతోపాటు చేతి నుంచి బాల్‌ విడుదల చేసే పాయింట్‌పై కూడా మోర్కెల్-హార్దిక్ చర్చించినట్టు సమాచారం. 

ఇక బంగ్లాతో టీ20 సిరీస్ కోసం హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ వంటి యువ స్టార్ల‌ను కూడా బీసీసీఐ ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. అలాగే ఐపీఎల్‌లో రాణించిన‌ అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డికి కూడా జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

మ‌రోవైపు చాలా కాలంగా టీమిండియా ఆడుతున్న టీ20ల‌కు దూరంగా ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈ సిరీస్ రెండవ అవకాశం అని చెప్పాలి. 

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.


More Telugu News