సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు... తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి

  • మంత్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్య
  • పరిశ్రమను కాంగ్రెస్ ఏ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తోందో అర్థమవుతోందన్న కేంద్రమంత్రి
  • రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్న
నాగచైతన్య, సమంత విడాకులు, నాగార్జునపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పలువురు సినీ ప్రముఖులపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని రాసుకొచ్చారు.

మన దేశానికి ఎంతో గర్వకారణమైన వినోద పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తుందో కూడా ఈ మాటలను బట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి విమర్శలకు తావు లేదన్నారు. తెలంగాణ మంత్రి (కొండా సురేఖ) వ్యాఖ్యలపై రాహుల్ గాంధీతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు. వారి మౌనం వెనుక ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.


More Telugu News