అంబులెన్సులు వెళ్లలేని గిరిజన ప్రాంతాలకు బైక్ అంబులెన్సులు: దామోదర రాజనరసింహ

  • ఐటీడీఏ పరిధిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులకు తెలంగాణ మంత్రి ఆదేశం
  • గిరిజన భాష మాట్లాడే వైద్య సిబ్బందిని నియమించాలన్న మంత్రి
  • ప్రతి గిరిజన గ్రామంలో ఆసక్తి ఉన్న ఇద్దరికి ప్రథమ చికిత్సపై శిక్షణ ఇవ్వాలని ఆదేశం
చాలా వరకు గిరిజన గూడేలకు అంబులెన్సులు వెళ్లగలిగే రోడ్లు లేకపోవడంతో బైక్ అంబులెన్సులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదిమ తెగ గిరిజనుల (పీటీజీ) కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, గిరిజన భాష మాట్లాడే వైద్య సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. 

రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ప్రసవ తేదీకంటే ముందే వారిని ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. 108 అంబులెన్సులు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గిరిజన ఆవాసాల్లో ఆసక్తి ఉన్న కనీసం ఇద్దరిని గుర్తించి ప్రథమ చికిత్సపై శిక్షణ ఇప్పించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మంత్రి తెలిపారు.


More Telugu News