పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు దెబ్బ‌మీద దెబ్బ‌.. స్టార్ ప్లేయ‌ర్ల‌కు సైతం అంద‌ని 4 నెల‌ల జీతాలు!

  • బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిల‌కు నాలుగు నెల‌లుగా నో శాల‌రీ
  • మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి
  • ఆట‌గాళ్లు ఘోరంగా విఫ‌లం కావ‌డంతో వారి కాంట్రాక్టుల‌పై పున‌రాలోచ‌న‌లో బోర్డు
ఇటీవ‌ల పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంతో పాటు విదేశాల్లోనూ ఘోరంగా విఫ‌లం అవుతున్న విష‌యం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కార‌ణం పీసీబీ కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తుండడం అనేది క్రికెట్ విశ్లేష‌కుల అభిప్రాయం. 

అయితే, ఇప్పుడు పీసీబీ గురించి కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ ఆట‌గాళ్లు తమ నాలుగు నెలల జీతం ఇంకా అందుకోలేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి ఉన్న‌ట్లు అక్క‌డి మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి.

మొత్తం 25 మంది సీనియర్ పురుషుల క్రికెటర్లకు జులై 1, 2023 నుండి జూన్ 30, 2026 వరకు మూడేళ్ల కాంట్రాక్టులు లభించాయి. అయితే, జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కాంట్రాక్టులపై సమీక్ష జరిగింద‌ని క్రికెట్ పాకిస్థాన్ నివేదిక పేర్కొంది. 

"గ‌తేడాది వ‌న్డే ప్రపంచ కప్‌కు ముందు కాంట్రాక్ట్ కోసం ఆటగాళ్లు బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. జులై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలల పాటు వారి నెలవారీ జీతాలు అందలేదు" అని నివేదిక పేర్కొంది.

మరోవైపు ఆగస్టు 21, 2023 నుండి 23 నెలల కాంట్రాక్ట్‌పై ఉన్న మహిళా జట్టు ఆట‌గాళ్ల‌కు గత నాలుగు నెలలుగా ఇంకా వేతనాలు చెల్లించలేదని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. వారి ఒప్పందాన్ని 12 నెలల తర్వాత సమీక్షించాలని నిర్ణయించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం దీనిపై బోర్డు ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌ పురుషుల క్రికెట్ జట్టు అక్టోబర్ 7 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. అటు మహిళల జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లింది.


More Telugu News