సొంత సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ రికార్డు

  • 'ఎక్స్‌'లో 200 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్న మొద‌టి వ్యక్తిగా ఎలాన్ మస్క్
  • మ‌స్క్ త‌ర్వాతి స్థానాల్లో ఒబామా (131.9 మిలియన్లు), రొనాల్డో (113.2 మిలియన్లు)
  • ప్ర‌ధాని మోదీకి 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లు
టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ సొంత‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో రికార్డు సృష్టించారు. గురువారం నాటికి 'ఎక్స్‌'లో ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 200 మిలియన్లకు చేరింది. దాంతో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ మార్క్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఇక మ‌స్క్ 'ఎక్స్‌'ను 2022 అక్టోబర్‌లో 44 బిలియన్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

కాగా, మ‌స్క్ త‌ర్వాత 'ఎక్స్‌'లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు), ఫుట్‌బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్లు) ఉన్నారు.

ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ల‌ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉంటే.. పాప్ గాయ‌ని రిహన్నా 108.4 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.

ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 100 మిలియన్ల మార్కును దాటారు. దీనిని మస్క్ కూడా ప్రశంసించారు. ప్రస్తుతం మోదీ 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం 'ఎక్స్‌'కి 600 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూలు), సుమారు 300 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు (డీఏయూలు) ఉన్న‌ట్లు ఇటీవ‌లే మస్క్ వెల్ల‌డించారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న 'ఎక్స్‌' సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భూమిపై 'ఎక్స్' అనేది గ్రూప్ చాట్‌గా మారింద‌న్నారు. "ఎక్స్‌ అనేది భూమికి సంబంధించిన గ్రూప్ చాట్" అని మస్క్ త‌న పోస్టులో పేర్కొన్నాడు.

ఇక ఈ వారం ప్రారంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఫిడిలిటీ ఎక్స్‌లో దాని హోల్డింగ్ విలువను ఏకంగా 78.7 శాతం తగ్గించింది. దీంతో ఎక్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ విలువ కేవలం 9.4 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.


More Telugu News