కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు: భూమన వ్యంగ్యం

  • తిరుపతిలో పవన్ వారాహి డిక్లరేషన్ సభ
  • జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
  • పవన్ స్పీచ్ కల్లు తాగిన కోతిలా ఉందన్న భూమన
  • లడ్డూలో కల్తీ జరిగిందని వెంకన్న పాదాల సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్
ఇవాళ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు 'కెవ్వు కేక' పాట గుర్తొచ్చిందని తెలిపారు. 

పవనానంద స్వామి ప్రసంగం కల్లుతాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. తన సభలో స్వామి పవనానంద న్యాయస్థానాలను సైతం హెచ్చరించారని భూమన తెలిపారు. 

ఇప్పటివరకు సనాతన ధర్మాన్ని ఎవరూ పట్టించుకోలేదట... అసలు, పవన్ స్వామికి సనాతన ధర్మంలో ఓనమాలు అయినా తెలుసా? అని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు సైతం కల్తీవని పవన్ స్వామి చెబుతున్నారు... ఇప్పుడు చాలెంజ్ చేస్తున్నా... తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని భూమన స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వెంకన్న పాదాల వద్ద ప్రమాణం చేయగలరా? అని సవాల్ విసిరారు. 

పవనానంద స్వామి మనసంతా విషభావాలతో నిండిపోయిందని, చెప్పిన అసత్యాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారని విమర్శించారు. బాప్టిజం తీసుకోవడం, గొడ్డు మాంసం తినడం సనాతన ధర్మమా? అని ప్రశ్నించారు. 

సనాతన ధర్మాన్ని పాటించే వారైతే... తమ పిల్లలు పుట్టిన తొమ్మిది నెలలకే తిరుమల తీసుకువచ్చి తల నీలాలు తీయిస్తారని, కానీ పవన్ 14 ఏళ్ల తర్వాత తన కుమార్తెలను తిరుమల తీసుకువచ్చాడని విమర్శించారు. మరి పవన్ ఏ విధంగా సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు అని మండిపడ్డారు. 

"మా నరనరాన సనాతన ధర్మం జీర్ణించుకుపోయి ఉంది. జగన్ హయాంలోనే అలిపిరిలో నిత్య హోమం ఏర్పాటు చేశాం. విద్యార్థులందరికీ భగవద్గీతను అందించాలనే నిర్ణయం చేసింది మేమే. గోవింద కోటి రాసిన వారికి బ్రేక్ దర్శనం కల్పించింది మేమే. 3,500 ఆలయాలు జగన్ హయాంలోనే నిర్మితమయ్యాయన్న విషయం గుర్తించాలి. 

శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయంటున్నారు... ఒక్కరూపాయి దారి మళ్లినా సరే నేను శిక్షకు సిద్ధమే. నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్లిపోవడం కాదు... దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలి. అధికారం కోసం పవన్ సనాతన ధర్మం ముసుగు వేసుకున్నాడు" అంటూ భూమన ధ్వజమెత్తారు.


More Telugu News