మతస్వేచ్ఛపై యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదిక... ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

  • యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్రేరేపిత కథనాలతో తప్పుడు ప్రచారం చేస్తోందన్న భారత్
  • ఇది రాజకీయ అజెండాతో కూడిన పక్షపాత సంస్థ అని విమర్శ
  • కుట్రపూరిత నివేదికను తాము తిరస్కరిస్తున్నామన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
భారత్‌లో మతస్వేచ్ఛపై దాడి జరుగుతోందంటూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదిక పక్షపాతంతో రూపొందించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మండిపడింది. భారత్‌పై యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్రేరేపిత కథనాలను వండి వార్చుతోందని ఆరోపించింది. భారత్‌కు సంబంధించినంత వరకు ఆ సంస్థ తప్పుగా ప్రచారం చేస్తోందని తెలిపింది.

యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదికపై మా అభిప్రాయం అందరికీ తెలుసునని, ఇది రాజకీయ అజెండాతో కూడిన పక్షపాత సంస్థ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇలాంటి కుట్రపూరిత నివేదికను తాము తిరస్కరిస్తున్నామన్నారు.

ఇలాంటి నివేదికలు ఇవ్వడం యూఎస్‌సీఐఆర్ఎఫ్‌ని మరింత అప్రతిష్ఠపాలు చేస్తుందన్నారు. ఇలాంటి కుట్రపూరిత అజెండాలకు యూఎస్‌సీఐఆర్ఎఫ్ దూరంగా ఉండాలని సూచించారు. అమెరికాలో అంతర్గతంగా ఉన్న మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడంపై యూఎస్‌సీఐఆర్ఎఫ్ దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు.


More Telugu News