ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితిని యువత ఆలోచించాలి: రేవంత్ రెడ్డి

  • అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న సీఎం
  • గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపణ
  • క్రీడలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న రేవంత్ రెడ్డి
ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితిని యువత ఆలోచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

రానున్న రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులకు శిక్షణను ఇస్తామన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడాకారులేనని కితాబునిచ్చారు. 

పాతికేళ్ల క్రితమే హైదరాబాద్‌లో ఏషియన్ గేమ్స్ నిర్వహించామని, అప్పుడు ఈ నగరం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ తెలంగాణ వచ్చాక క్రీడలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

యువత డ్రగ్స్, గంజాయికి అలవాటుపడటం చూసి చాలా బాధపడ్డామన్నారు. బాక్సింగ్‌లో రాణిస్తున్న నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చామని... క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇచ్చి, ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. క్రీడలను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ను హబ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసే ప్రదేశం క్రీడామైదానం అని అన్నారు.


More Telugu News