అన్నీ తెలిసే నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు... ఇవిగో ఆధారాలు!: పట్టాభి

  • వెంకటేశ్వరస్వామి లడ్డూ వివాదం
  • ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి మొత్తం కల్తీనే అంటూ పట్టాభి ఆరోపణలు
  • ఆ సంస్థకు రూ.31.98 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని వెల్లడి
  • కల్తీ నెయ్యి వెనుక ఎవరి హస్తం ఉందో నిగ్గు తేల్చేందుకు సిట్ వేశామని స్పష్టీకరణ 
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సంపదను దోచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీని జంతువుల కొవ్వుతో కలిసిన కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిందని తెలుగుదేశంపార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. 

మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని ఆరోపిస్తూ, పలు కీలక డాక్యుమెంట్లను మీడియా ముందు పట్టాభిరామ్ ఉంచారు. 

ఇది క్షమించరాని పాపం!

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం క్షమించరాని పాపం చేసింది. అన్నీ తెలిసే వైసీపీ ఏఆర్ డెయిరీని అడ్డుపెట్టుకుని స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైన నెయ్యిని వాడారు. జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యిని వైసీపీ పాలకులు వాడి క్షమించరాని పాపం చేశారు.మరిన్ని ఆధారాలు నేడు ప్రజల ముందు ఉంచుతున్నాం. 10 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంట్రాక్టు విలువ రూ.31.98 కోట్లు.

ఒక్కరోజు ముందు అగ్రిమెంట్ చేసుకున్నారు

మే 15 2024న వైసీపీ ప్రభుత్వం ఏఆర్ ఫుడ్స్ డెయిరీకి టీటీడీ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది. టెండర్ పిలిచింది మార్చి 12న, ఫైనల్ చేసింది మే 8న, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15న, అగ్రిమెంట్ చేసుకుంది జూన్ 11న. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే ఒక్కరోజు ముందు అగ్రిమెంట్ ను పకడ్బందీగా వైసీపీ ప్రభుత్వం చేసింది. 2023 నవంబర్ 8న ఒక టీటీడీ టెక్నికల్ టీమ్ ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పరిశీలనకు వెళ్లింది. 

ఏఆర్ డెయిరీ సంస్థ 2022-2023 సంవత్సరానికి 14,940 కిలోలు(14.9టన్నులు) మాత్రమే బల్క్‌గా సరఫరా చేసినట్లు టెక్నికల్ టీమ్ నిర్ధారించింది. ఏఆర్ ఫుడ్స్ డెయిరీ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు సుమారు 16 టన్నులు మాత్రమే. దీని ప్రకారం చూస్తే 6 నెలలకు దాదాపు 100 టన్నుల నెయ్యి మాత్రమే ఏఆర్ డెయిరీ ఉత్పత్తి చేయగలదు. కానీ 6 నెలల్లో టీటీడీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చారు.  

ఆ ట్యాంకర్లు ఎక్కడెక్కడ తిరిగాయి?

ఏఆర్ డెయిరీ టీటీడీకి 8 ట్యాంకులు నెయ్యిని సరఫరా చేసింది. వాటిలో 4 ట్యాంకులు పంపితే దాన్ని వాడారు, మిగిలిన 4 ట్యాంకులను టీటీడీ వెనక్కి పంపించింది. 

జూన్ 4, 2024న ఏఆర్ ఫుడ్స్ నుండి టీటీడీకి మొదటి  నెయ్యి ట్యాంకర్ AP26TC4779 దిండిగల్ నుండి బయలు దేరింది. ఈ లారీ జూన్ 12, 2024న తిరుమలలోని  టీటీడీకి చేరింది. దిండిగల్ నుండి తిరుమలకు కేవలం 500 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ దూరం ప్రయాణించడానికి 8 రోజుల ప్రయాణం పడుతుందా? 8 రోజుల పాటు ఈ లారీ ఎక్కడెక్కడ తిరిగి కల్తీ నెయ్యిని తీసుకువచ్చింది? 

జూన్ 11న ఏఆర్ ఫుడ్స్ నుండి బయలుదేరిన 2వ నెయ్యి ట్యాంకర్ 20న (10రోజులకు) టీటీడీ ఇన్ గేటుకు చేరింది. 24 జూన్ 2024న స్టోరేజీ ప్లేస్ కు వెళ్లింది. 

2024 జూన్ 19న మూడవ ట్యాంకర్ ఏఆర్ ఫుడ్స్ నుండి బయలుదేరి 2024 జూన్ 25న (7రోజులకు) టీటీడీకి చేరింది. 

జూన్ 27న బయలుదేరిన 4వ ట్యాంకర్, జూలై 4న(8 రోజులకు) ఇన్ గేట్ లోకి వచ్చింది. జూలై 12న స్టోరేజీ ప్రాంతానికి చేరింది. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ టీటీడీకి అవసరమైనంత నెయ్యి ఉత్పత్తి, సరఫరా చేసే సామర్థ్యం లేక, తమ ట్యాంకర్లను వివిధ ప్రాంతాలకు పంపి, కల్తీ నెయ్యిని ట్యాంకర్లలో నింపి, తిరుమలకు తీసుకొచ్చేందుకు 8 రోజుల సమయం పట్టిందా? 

ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన కల్తీ నెయ్యి వెనుక ఎవరెవరి హస్తం ఉందో నిగ్గు తేల్చడానికే మా ప్రభుత్వం సిట్ వేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో సిట్ విచారణను వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షిస్తాం... అని పట్టాభి స్పష్టం చేశారు.


More Telugu News