ఎందుకిలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు?.. మహ్మద్ షమీ ఆగ్రహం

  • బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి షమీ దూరమైనట్టు వార్తలు
  • గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం పట్టొచ్చన్న ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’
  • ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్న షమీ
ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైనట్టు వచ్చిన వార్తలపై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. ఎందుకిలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న షమీ ఆ తర్వాత చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో తిరిగి జట్టులోకి రానున్నాడు. 

బీసీసీఐని ఉటంకిస్తూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురిస్తూ.. షమీ తిరిగి బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడని, తిరిగి జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. షమీ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం అంచనా వేస్తోందని, అతడు జట్టులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని పేర్కొంది. జాతీయ క్రికెట్ అకాడమీకి ఇది ఒక కుదుపు లాంటిదేనని, షమీ కోసం వారం ఏడాదిగా పనిచేస్తున్నారని పేర్కొంది. అతడిని తిరిగి మైదానంలో దింపేందుకు మెడికల్ టీం శాయశక్తులా కృషి చేస్తోందని రాసుకొచ్చింది. 

అయితే, షమీ ఈ వార్తలను ఖండించాడు. ఇలాంటి నిరాధార వార్తలను ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించాడు. తన బెస్ట్ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు తెలిపాడు. తాను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమైనట్టు తాను కానీ, బీసీసీఐ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నాడు. తాను చెప్పకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని ‘ఎక్స్’ ద్వారా కోరాడు.


More Telugu News