అలాంటి మహిళలే రైతులను పెళ్లాడతారు.. మహారాష్ట్ర ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • మహిళలను మూడు రకాలుగా వర్గీకరించిన ఎమ్మెల్యే దేవేంద్రభూయార్
  • స్వతంత్ర ఎమ్యేలే దేవేంద్ర భూయార్ అజిత్ పవార్ మద్దతుదారు
  • ఇలాంటి వారికి సమాజంలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్ హెచ్చరిక
మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మద్దతుదారుడైన దేవేంద్ర భూయార్ మహిళలు, రైతు బిడ్డలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమరావతిలోని ఓ బహరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కుమారులు పెళ్లి చేసుకునేందుకు యువతులే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘అందంగా ఉన్న యువతులు నీలాగా, నాలాగా ఉన్న వారిని ఎంచుకోవడం లేదు. ఉద్యోగం ఉన్న వ్యక్తిని ఎంచుకుంటున్నారు’’ అని చెప్పిన ఆయన మహిళలను మూడు రకాలుగా వర్గీకరించారు. ఉద్యోగం ఉన్న వ్యక్తిని ఎంచుకునే వారు మొదటి రకమని పేర్కొన్న ఎమ్మెల్యే.. రెండోరకం ఆడవాళ్లు చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు, షాప్ కీపర్లను ఎంచుకుంటున్నారని, మూడో రకం ఆడవాళ్లు మాత్రమే రైతుల కుమారులను పెళ్లి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వివాహాల నుంచి వారి పిల్లలు బలహీనమైన లక్షణాలను వారసత్వంగా పొందుతారని పేర్కొన్నారు. 

మహిళలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అవి మహిళలను అవమానించేవిగా, అగౌరపరిచేవిగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను ఇలా వర్గీకరించడాన్ని ఎవరూ సహించబోరని కాంగ్రెస్ నేత, మహిళా, శిశుసంక్షేమశాఖ మాజీమంత్రి యశోమతి ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ పవార్, అధికారంలో ఉన్నవారు తమ ఎమ్మెల్యేలను నియంత్రించాలని కోరారు. ఇలాంటి వారికి సమాజం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.


More Telugu News