ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తత ప్రభావంతో భారత్‌లో పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

  • గత రెండు రోజుల్లో గణనీయంగా పెరిగిన చమురు ధరలు
  • యుద్ధం తలెత్తితే సప్లయి తగ్గి.. డిమాండ్ పెరగొచ్చనే భయాలు
  • చమురు ధరల పెరుగుదల కొనసాగితే భారత్‌లోనూ ఇంధర ధరలు పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ బుధవారం పెద్ద ఎత్తున ఖండాంతర క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణులను గగన తలంలోనే ఇజ్రాయెల్ కూల్చివేసినప్పటికీ.. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం చమురు ధరలపై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత రెండు రోజులుగా చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. వరుసగా మంగళ, బుధవారం పెరిగి రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి.

ఈ ప్రభావంతో ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఇంధన ధరలు పెరగకపోయినప్పటికీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం మన దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగే సంకేతాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం చమురు ధరల పెరుగుదలకు దారితీసిందని ప్రస్తావించారు.

భారత్‌పై ప్రభావం ఎందుకు?
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించడానికి ముందే దాడి జరగవచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు చమురు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. చమురు సప్లయికి అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో యుద్ధం తలెత్తితే చమురు డిమాండ్ తగ్గొచ్చని, ఈ ప్రాంతంలో చమురు ఉత్పత్తి కూడా తగ్గొచ్చనే భయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రభావంతో ఈ రెండు రోజుల్లో సప్లయ్ గణనీయంగా తగ్గడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. 

కాబట్టి ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే భారత్‌పై కూడా ప్రభావం పడడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చమురు విషయంలో భారత్ ఎక్కువగా మధ్య ఆసియా దేశాలపైనే ఆధారపడుతోంది. ఎక్కువ రేటుతో చమురును కొనుగోలు చేయాల్సి వస్తే ఆ ప్రభావాన్ని దేశంలోని వాహనదారులపై మోపాల్సి వస్తుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. యంత్ర సామాగ్రి, ఫార్మాస్యూటికల్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తుండగా... ఆ దేశాల నుంచి చమురు, నేచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ వంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది.


More Telugu News