భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌.. స‌చిన్, గ‌వాస్క‌ర్‌కు సాధ్యంకాని ఫీట్‌ను అందుకున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌

  • ఇరానీ కప్‌లో ముంబ‌యి త‌ర‌ఫున తొలి ద్విశ‌త‌కం న‌మోదు చేసిన స‌ర్ఫ‌రాజ్
  • 42 సార్లు రంజీ ఛాంపియన్ అయిన‌ ముంబ‌యికి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరానీ క‌ప్‌లో నో డ‌బుల్ సెంచరీ
  • తొలి డ‌బుల్ సెంచ‌రీతో చ‌రిత్ర సృష్టించిన‌ స‌ర్ఫ‌రాజ్
టీమిండియా యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశాడు. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబ‌యి తరఫున డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా సర్ఫరాజ్ (221 బ్యాటింగ్) చ‌రిత్ర సృష్టించాడు. 42 సార్లు రంజీ ఛాంపియన్ అయిన‌ ముంబ‌యి జ‌ట్టుకు ఇప్ప‌టికే ఎంతో మంది దిగ్గ‌జ క్రికెట‌ర్లు ఆడారు. కానీ, ఎవ‌రూ ఇప్ప‌టివ‌ర‌కు ద్విశ‌త‌కం న‌మోదు చేయ‌లేదు. భార‌త దిగ్గ‌జాలు సునీల్ గ‌వాస్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌ల‌కు కూడా ఈ ఫిట్ సాధ్యం కాలేదు. దాన్ని స‌ర్ఫ‌రాజ్ చేసి చూపించాడు. 

ఇక ఇరానీ కప్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇత‌ర జ‌ట్ల‌కు చెందిన‌ వసీం జాఫర్ (విదర్భ), రవిశాస్త్రి , ప్రవీణ్ అమ్రే, యశస్వి జైస్వాల్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) మాత్ర‌మే డబుల్ సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ చేరాడు. 

ఇదిలాఉంటే.. స‌ర్ఫ‌రాజ్ అజేయ ద్విశ‌త‌కంలో 25 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అలాగే 80 స్ట్రైక్ రేట్‌తో ఈ ప‌రుగులు సాధించాడు. ఇది అతని 15వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. మ‌రోవైపు ముంబ‌యి కెప్టెన్ అజింక్యా రహానే కూడా త్రుటిలో శ‌త‌కం చేజార్చుకున్నాడు. 97 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. దీంతో 40వ ఫస్ట్ క్లాస్ సెంచరీని కోల్పోయాడు.


More Telugu News