మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై.. నాగచైత‌న్య, నాని, అఖిల్‌, ఖుష్బూ ఏమ‌న్నారంటే..!

  • సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చనీయాంశంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు
  • సినీ ప్ర‌ముఖుల జీవిత నిర్ణయాల‌ను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉప‌యోగించొద్ద‌న్న నాగ‌చైత‌న్య‌
  • ఏం మాట్లాడినా త‌ప్పించుకోవ‌చ్చ‌నే రాజకీయ నేత‌ల ధోర‌ణి అస‌హ్యం క‌లిగిస్తోందన్న నాని
  • త‌ల్లి అమ‌ల మాట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌ హీరో అఖిల్
  • మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలన్న న‌టి ఖుష్బూ  
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌నంగా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, అమ‌ల‌, ఎన్‌టీఆర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా నాగ చైత‌న్య, హీరో నాని, అఖిల్‌, ఖుష్బూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం: నాగ‌చైత‌న్య
స‌మంత‌తో త‌న విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను అక్కినేని నాగ చైత‌న్య తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దమ‌ని పేర్కొన్నారు. 
 
"జీవితంలో విడాకుల నిర్ణ‌యం అనేది అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన‌, బాధాక‌ర‌మైన విష‌యాల్లో ఒక‌టి. ఎన్నో ఆలోచ‌న‌ల త‌ర్వాత ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే నా మాజీ భార్య‌, నేను విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నాం. మా విడాకుల‌పై గ‌తంలో అనేక నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

ఇరు కుటుంబాల‌పై ఉన్న గౌర‌వంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం. ఆమె వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాదు. స‌మాజంలో మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తుతో పాటు గౌర‌వం ద‌క్కాలి. సినీ ప్ర‌ముఖుల ప‌ర్స‌న‌ల్ లైఫ్ నిర్ణ‌యాల‌ను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉప‌యోగించుకోవడం సిగ్గుచేటు" అని నాగ‌చైత‌న్య ట్వీట్ చేశారు.  

సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి: నాని   
"తాము ఏం మాట్లాడినా త‌ప్పించుకోవ‌చ్చ‌ని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి" అని నాని ట్వీట్ చేశారు. 

ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు: అక్కినేని అఖిల్  
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల చేసిన ట్వీట్‌కు ఆమె కుమారుడు, యువ న‌టుడు అఖిల్ స్పందించారు. "అమ్మ‌.. మీ ప్ర‌తి మాట‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేదు" అని అఖిల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: న‌టి ఖుష్బూ
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌, న‌టి ఖుష్బూ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్య‌త‌రాహిత్య‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని స‌హించ‌బోద‌ని, మొత్తం సినీ పరిశ్రమకు సురేఖ‌ క్షమాపణ చెప్పాల‌ని ఖుష్బూ ట్వీట్ చేశారు. 

"రెండు నిమిషాల ఫేమ్, ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడతార‌ని అనుకున్నాను. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారూ, మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదు. ఇలాంటి ఆధారంలేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు మీరు మరొక మహిళకు మహిళగా, మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేం" అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.


More Telugu News