నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేం.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై ఎన్‌టీఆర్‌

  • మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు
  • వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం స‌రికాదన్న తార‌క్‌
  • సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయ‌డం బాధించింద‌ని వ్యాఖ్య‌
నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఇత‌రులు త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమ‌ని అన్నారు. సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం బాధించింద‌ని తార‌క్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మంత్రి వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. 

"కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం స‌రికాదు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్రకటనలు చేయ‌డం తీవ్రంగా బాధించింది. 

ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోం. ఇలాంటి వాటిని సినీ ప‌రిశ్ర‌మ స‌హించ‌దు. ఒక‌రిని ఒక‌రు గౌర‌వించుకోవ‌డం, ప‌రిధులు దాటి ప్ర‌వ‌ర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని క‌చ్చితంగా లేవ‌నెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను మన సమాజం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హ‌ర్షించ‌దు" అని తార‌క్ ట్వీట్ చేశారు.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా రంగం నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని ఆమె ఆరోపించారు. 

కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకుని, మదమెక్కి... వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విషయం సినీ ఇండ‌స్ట్రీలో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో సురేఖ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 


More Telugu News