లడ్డూ అంశంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్టుగా ఉంది: షర్మిల

  • లడ్డూ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును తొలుత కాంగ్రెస్ కోరిందన్న షర్మిల
  • ఈ అంశానికి మతం రంగు పులుముతున్నారని మండిపాటు
  • విశాఖలో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల
తిరుమల లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే... ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్టుగా ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని అందరి కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కోరిందని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ను కూడా కోరామని తెలిపారు. లడ్డూ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా తమతో ఏకీభవిస్తోందని అన్నారు. 

లడ్డూ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని షర్మిల తెలిపారు. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారని, మరొకరు పశ్చాత్తాప దీక్షలంటున్నారని, ఇంకొకరు ప్రక్షాళన పూజలు అంటున్నారని విమర్శించారు. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఈ అంశానికి మతం రంగు పులుముతున్నారని చెప్పారు. 

ఈరోజు విశాఖలో గాంధీ జయంతి కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అంతకు ముందు విమానాశ్రయంలో షర్మిలకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షర్మిల పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News