అలా చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం: హోంమంత్రి అనిత వార్నింగ్‌!

అలా చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం: హోంమంత్రి అనిత వార్నింగ్‌!
  • ఏలూరు కాల్ మ‌నీ ఘ‌ట‌న‌పై స్పందించిన హోంమంత్రి 
  • అధిక వ‌డ్డీలు, అక్ర‌మ‌ వ‌సూళ్లు చేస్తే స‌హించేది లేద‌న్న అనిత‌
  • అలా చేసే వారిపై క్రిమిన‌ల్ కేసులు బ‌నాయిస్తామ‌ని హెచ్చ‌రిక‌
  • ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డి
ఏలూరు కాల్ మ‌నీ ఘ‌ట‌న‌పై స్పందించిన హోంమంత్రి వంగ‌ల‌పుడి అనిత... అధిక వ‌డ్డీలు, అక్ర‌మ‌ వ‌సూళ్లు చేస్తే స‌హించేది లేద‌ని, అలాంటి వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను వ‌డ్దీల పేరుతో ఇబ్బంది పెట్ట‌రాద‌ని అన్నారు.  

కిస్తీల‌కు ముందే వ‌డ్డీ కోత‌, గ‌డువు దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై హోంమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 

అక్ర‌మ వ‌సూళ్ల‌తో అమాయ‌కుల‌ను బ‌లిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామ‌న్నారు. వ‌డ్డీ వ్యాపారాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నామ‌ని మంత్రి అనిత పేర్కొన్నారు. రోజువారీ వ‌డ్డీల పేరిట సామాన్య జ‌నాల‌ను వేధించేవారిని విడిచిపెట్టేది లేద‌ని హెచ్చరించారు.  

వైసీపీ నేత కాల్ మ‌నీ దందాకు తాము బ‌ల‌య్యామ‌ని ఇటీవ‌ల ఏలూరులో బాధితులు త‌మ గోడును వెళ్ల‌బోశారు. తాము తీసుకున్న అప్పుకు అధిక వ‌డ్డీలు క‌ట్టించుకున్నార‌ని వాపోయారు. స‌మ‌యానికి అప్పు చెల్లించ‌క‌పోతే అస‌భ్య‌ ప‌ద‌జాలంతో తిట్టేవార‌ని, భ‌య‌ప‌డి క‌ట్టినా ఇంకా బ‌కాయి ఉన్నారంటూ వేధించేవారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.    

అప్పు ఇచ్చిన స‌మ‌యంలో తీసుకున్న ప్రామిస‌రీ నోట్ల‌తో ఇప్పుడు త‌మ‌ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నార‌ని వాపోయారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై మంత్రి అనిత ఇప్ప‌టికే ఏలూరు జిల్లా ఎస్‌పీతో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.


More Telugu News