8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. దోషికి మరణశిక్ష విధించిన పోక్సో కోర్టు

  • ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో 2022లో ఘటన
  • బాలికపై లైంగికదాడి అనంతరం తలనరికిన నిందితుడు
  • నిందితుడిని దోషిగా నిర్ధారించి తుదితీర్పు వెలువరించిన కోర్టు
  • ఉరిశిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధింపు
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆపై గొడ్డలితో నరికి చంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన పోక్సోకోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని పోక్సో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం జిల్లాలోని జామన్‌కిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాలిక 25 మార్చి 2022లో సమీపంలోని పొలంలో ఆడుకునేందుకు వెళ్లింది.

ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన నిందితుడు ప్రశాంత బఘార్ బాలికను బలవంతంగా దూరంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను గొడ్డలితో నరికి, ఆమె తల పట్టుకుని గ్రామానికి వచ్చాడు. బాలిక తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 25 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. అతడికి లక్ష రూపాయల జరిమానా విధించడంతోపాటు ఉరిశిక్ష విధిస్తూ నిన్న తుది తీర్పు వెలువరించింది.


More Telugu News