ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు.. తొలిసారి స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా

  • మా ఫ్రంట్‌కు తగులుతున్న దెబ్బలు బలంగా మారతాయన్న ఇరాన్ అధినేత
  • ఇజ్రాయెల్‌కు బాధాకరంగా మారతాయని హెచ్చరిక
  • ఇజ్రాయెల్‌పై దాడి ముగిసిందని ప్రకటించిన ఇరాన్
  • రెచ్చగొట్టే చర్యలు లేకుండానే ముగిసిందని వ్యాఖ్య
  • మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. తమ సమూహానికి తగులుతున్న ఎదురు దెబ్బలు మరింత బలంగా మారుతాయని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ‘‘దేవుడి దయతో మా తిరుగుబాటు ఫ్రంట్‌కు తగులుతున్న మరింత బలంగా మారతాయి. కుళ్లిపోయిన జియోనిస్ట్ పాలన మరింత బాధాకరంగా పరిణమిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.

మరోవైపు ఇజ్రాయెల్‌పై తమ దాడి ముగిసిందని బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ నుంచి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే ముగిసిందని వివరించింది. కాగా ఇరాన్‌పై ప్రతీకార దాడి ఉంటుందని ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించాయి. మంగళవారం జరిపిన దాడికి ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ మేరకు చిరకాల మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా ప్రకటించింది.

ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం
హిజ్బుల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఒకేసారి సుమారు 180 వరకు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కూల్చివేసింది. కొన్ని మాత్రమే నగరాలకు తాకాయి. ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియనప్పటకీ తమవైపు కొద్ది మంది మాత్రమే గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రకటించింది. జులైలో టెహ్రాన్‌లో ఉన్న హమాస్ నేత ఇస్మాయెల్ హనియే బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండటంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోయింది.

తాజాగా ఇరాన్‌కు అత్యంత సన్నిహితుడైన లెబనాన్‌కు చెందిన హెజ్బూల్లా అగ్రనేత నస్రల్లాను కూడా ఇజ్రాయెల్ చంపేసింది. దీంతో ఇరాన్ ఆగ్రహం తారస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్‌కు అనుకూల మిలిటెంట్ గ్రూపులు. వీటికి ఇరాన్ మద్దతు ఉంది. వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో స్పందనగా ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ నుండి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయి. ఈ దాడుల గురించి తమ అంతర్జాతీయ భాగస్వాములకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు అధికారికంగా ప్రకటించింది. 

ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్ఫందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులతో బెంబేలెత్తిన ఇజ్రాయెలీలు బాంబు షెల్టర్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరి కొందరు రోడ్డు పక్కన రక్షణ ప్రదేశాల్లో దాక్కున్నారు. దేశమంతా సైరన్ల మోత మోగింది. టీవీ ఛానళ్లు, మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. ఇరాన్ క్షిపణులను కూల్చివేయాలని ఆమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఈ పోరు మరింత విస్తరిస్తే ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News