రేపటి నుంచి 10వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు

  • సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
  • ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రవీంద్రభారతిలో వేడుకలు
  • సద్దుల బతుకమ్మ రోజున ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబురాలు
తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ నెల 10న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నారు. బతుకమ్మ పండుగ చేసే తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతారు.

రేపటి నుంచి వరుసగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నాన బియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. 1వ రోజు నుంచి 9వ రోజు వరకు మహిళలు బతుకమ్మ ఆడుతారు. కానీ ఆరో రోజు అలిగిన బతుకమ్మను ఎవరూ ఆడరు.

"రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలను ప్రజా ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటుకునేలా అక్టోబర్ 2 నుంచి 10 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు సద్దుల బతుకమ్మ నాడు ట్యాంక్ బండ్ వేదికగా పెద్దఎత్తున సంబరాలు జరుగుతాయి." అంటూ తెలంగాణ సీఎం సీపీఆర్వో అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.


More Telugu News