టీసీఎస్‌లో అప్పుడు వేతనం రూ.1,300... నెట్టింట నాటి ఆఫర్ లెటర్ వైరల్

  • రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్‌కు చెందిన ఆఫర్ లెటర్
  • 40 ఏళ్ల క్రితం రూ.1,300 వేతనమే చాలా ఎక్కువ అని వెల్లడి
  • ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్లిన రోహిత్ కుమార్
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిత్ కుమార్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన తన టీసీఎస్ ఆఫర్ లెటర్ నెట్టింట వైరల్‌గా మారింది. 1989 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 1984లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించారు. ఇందుకు సంబంధించిన ఆఫర్ లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

40 ఏళ్ల క్రితం ఆయన వేతనం, ఇతర వివరాలు ఆ ఆఫర్ లెటర్‌లో ఉన్నాయి. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం... దీనిని 1984 జూన్ 20న ఇచ్చారు. 1984 జూన్ 4 నుంచి నెలకు రూ.1,300 వేతనం ఇస్తున్నట్లుగా అందులో ఉంది.

నలభై ఏళ్ల క్రితం తాను బీహెచ్‌యూ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలక్ట్ అయ్యానని, ముంబై టీసీఎస్ క్యాంపస్‌లో తనకు మొదట ఉద్యోగం వచ్చిందని రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అప్పట్లో తన వేతనం 1,300 గా ఉందని, అది చాలా ఎక్కువ అన్నారు. నారీమన్ పాయింట్‌లోని ఎయిరిండియా 11వ అంతస్తు నుంచి సముద్రం చూసేందుకు అద్భుతంగా ఉండేదన్నారు.

1984లో టీసీఎస్‌లో చేరిన రోహిత్ కుమార్ సింగ్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ కోసం న్యూయార్క్ క్లార్క్‌సన్ యూనివర్సిటీలో చేరారు. మాస్టర్ డిగ్రీ తర్వాత అతను భారత్ తిరిగి వచ్చి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు. అందులో క్వాలిఫై అయి ఐఏఎస్ అయ్యారు.


More Telugu News