జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు

  • జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న మూడో విడత ఎన్నికలు
  • దశాబ్దాల తర్వాత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు
  • తమ సామాజిక వర్గానికి మంచి రోజులు వస్తాయని ఆశాభావం 
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి నేడు జరుగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాల్మీకి ప్రజలు మాట్లాడుతూ.. దశాబ్దాల తర్వాత ఓటు వేసే హక్కు సొంతమైందని ఆనందంగా చెప్పారు. ఇకనైనా తమ సామాజిక వర్గానికి మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో తమ సామాజిక వృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ మార్పు తర్వాత తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. 

85 ఏళ్ల లాల్‌చంద్ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ.. తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన పిల్లల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. వారు బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి భవిష్యత్తు బాగుండాలనే ఓటు వేసినట్టు వివరించాడు. 

ఇదే సామాజిక వర్గానికి చెందిన ఏక్తా మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వం కూడా ఓట్లు అడుగుతుందని, కానీ, తమకు ఓటు హక్కే లేదని, ఓటు ఎలా వేస్తామని ప్రశ్నించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం మంచి పనిచేసిందని కృతజ్ఞతలు తెలిపారు. తమకు చాలా అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. తమ భవిష్యత్తుకు పాటుపడే ప్రభుత్వాలనే ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.


More Telugu News