పాకిస్థానీ భర్త, బంగ్లాదేశీ భార్య.. ఆరేళ్లుగా బెంగళూరులో కాపురం

  • నకిలీ పాస్ పోర్ట్ తో భారత్ లో నివసిస్తున్న జంటను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పశ్చిమ బెంగాల్ నుంచి అక్రమంగా దేశంలోకి ఎంట్రీ
  • తల్లిదండ్రులతో కలిసి బెంగళూరు శివారులోని విల్లాలో నివాసం
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థానీ పౌరుడు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టు, ఆధార్ కార్డులను సంపాదించాడు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని ఆమె తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో కాపురం పెట్టాడు. పేర్లు మార్చుకుని భారతీయులుగా చలామణీ అవుతున్నారు. గత నెలలో ఈ కుటుంబం ఫేక్ పాస్ పోర్టులతో బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. ఆ తర్వాత మళ్లీ బెంగళూరుకు తిరిగొచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ కు చెందిన రషీద్ అలీ సిద్దిఖీ, ఆయన భార్య ఆయేషా హనీఫ్ (బంగ్లాదేశ్ పౌరురాలు), ఆమె తల్లిదండ్రులు 2014లో అక్రమంగా పశ్చిమ బెంగాల్ లోకి ఎంటరయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని 2018 వరకూ అక్కడే ఉన్నారు. ఆపై బెంగళూరుకు వచ్చి సిటీ శివార్లలోని ఓ విల్లాలో కాపురం ఉంటున్నారు. శంకర్ శర్మ, ఆశా శర్మగా పేర్లు మార్చుకుని, తప్పుడు పత్రాలతో ఇండియన్ పాస్ పోర్టు, ఢిల్లీ చిరునామాతో ఆధార్ కార్డులు సంపాదించారు. సిద్దిఖీ సిటీలో ఇంజన్ ఆయిల్ అమ్మే షాపు నడిపిస్తున్నాడు.

ఈ కుటుంబం గత నెలలో బంగ్లాదేశ్ లోని ఢాకాకు వెళ్లి వచ్చింది. అక్కడ జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. వీరి పాస్ పోర్టులు, డాక్యుమెంట్లపై అనుమానం రావడంతో చెన్నై ఇమిగ్రేషన్ అధికారులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిద్దిఖీ ఉంటున్న విల్లాపై పోలీసులు సోమవారం రెయిడ్ చేసి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.


More Telugu News