భార్య నిర్ణయంపై సిద్దరామయ్య ఆశ్చర్యం.. ఆమె విద్వేష రాజకీయాల బాధితురాలని ఆవేదన

  • భూములను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు నిన్న పార్వతి ప్రకటన
  • ప్రభుత్వానికి తిరిగి అప్పగించారన్న సిద్దరామయ్య
  • భార్య నిర్ణయం ఆశ్చర్యం కలిగించినా గౌరవిస్తున్నానన్న సీఎం
  • తనపై జరుగుతున్న విద్వేష రాజకీయాలతో ఆమె కలత చెందిందన్న సిద్దూ
తన భార్య పార్వతి విద్వేష రాజకీయ బాధితురాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరు అప్‌మార్కెట్ ప్రాంతంలో తనకు కేటాయించిన 14 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించినట్టు మంగళవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల కేటాయింపు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తనకు కేటాయించిన 14 స్థలాలను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సీఎం భార్య పార్వతి నిన్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కమిషనర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో తాజాగా సిద్ధరామయ్య ఇలా స్పందించారు.

తమ నుంచి తీసుకున్న భూమికి పరిహారంగా ఇచ్చిన భూమిని తన భార్య పార్వతి తిరిగి ఇచ్చేసిందని సిద్దరామయ్య తెలిపారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసని, తన కుటుంబాన్ని అకారణంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయానికి తలొగ్గకుండా పోరాడతానని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కుట్రతో తన భార్య కలత చెంది ఈ ప్లాట్లను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలనుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. 

తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తన కుటుంబం ఏనాడూ జోక్యం చేసుకోలేదని సిద్దరామయ్య పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్వేష రాజకీయాల్లో ఆమె బాధితురాలిగా మారిందని, మానసికంగా చిత్రహింసలు అనుభవించిందని వాపోయారు. ఏది ఏమైనా తన భార్య నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు.


More Telugu News