రేవంత్ రెడ్డి గారూ... మొదట హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలి: కేటీఆర్

  • నాలాపై ఉన్న హైడ్రా ఆఫీస్‌తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేయాలన్న కేటీఆర్
  • 60 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ చెరువులను ఎందుకు గుర్తించలేదని ప్రశ్న
  • రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో వచ్చారని విమర్శ
రేవంత్ రెడ్డి గారూ, హైడ్రా పేరుతో కూల్చాల్సిన పరిస్థితి వస్తే మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ కార్యాలయాన్ని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాలాల మీద ఉన్న నిర్మాణాలను కూల్చాలని చెబుతున్నారని, అదే నిజమైతే హైడ్రా కమిషనర్ కూర్చున్న బుద్ధ భవన్ నాలా పైనే ఉందన్నారు. హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న ఈ భవనంలో ఎలక్షన్ కమిషనరేట్, హైడ్రా కమిషనరేట్, మహిళా కమిషనరేట్... ఇలా ఎన్నో ఉన్నాయన్నారు.

ఆ తర్వాత నాలా పైన ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చేయాలన్నారు. అన్ని నిర్మాణాలకు అనుమతి ఇచ్చే జీహెచ్ఎంసీ భవనం కూడా నాలా పైనే ఉందన్నారు. అసలు 60 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ చెరువులను ఎందుకు గుర్తించలేదో చెప్పాలన్నారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూల్చుతామని ముందే చెబితే ప్రజలు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉండేవారు కాదన్నారు.

రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో వచ్చినట్లు ప్రజలు హఠాత్తుగా రాలేదు

రేవంత్ రెడ్డి గారూ, నీవేదో లక్కీ డ్రాలో వచ్చినట్లుగా ప్రజలు కూడా అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలోకి హఠాత్తుగా వచ్చారని భావించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారు అక్కడే దశాబ్దాలుగా ఉంటున్నారని గుర్తించాలన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటినా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, తులం బంగారం, మహిళలకు రూ.2,500 సహా 420 హామీలను ఇప్పటికీ కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందన్నారు.

ఇప్పుడు హైడ్రా ఎన్నో నిర్మాణాలను కూల్చివేస్తోందని, కానీ చాలా నిర్మాణాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న 25 వేల కుటుంబాలను రోడ్డు మీద పడవేస్తానంటే ఎలా? అని మండిపడ్డారు. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే హక్కు ముఖ్యమంత్రికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. తప్పు చేసింది ఎవరు... ఈ ప్రభుత్వం శిక్ష ఎవరికి వేస్తుంది? అని నిలదీశారు.

1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమకు పట్టాలు ఇచ్చారని, అప్పుడే ఇళ్లు కట్టుకున్నామని, వారి హయాంలోనే రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయని బాధితులు చెబుతున్నారని వెల్లడించారు. తాము ముప్పై, నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్నామని వాపోతున్నారన్నారు.

ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు... భవనానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు... ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు... దశాబ్దాలుగా కరెంట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు... కరెంట్ బిల్లులు కట్టించుకున్నప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో చెప్పాలని మండిపడ్డారు. అర్ధాంతరంగా ఇల్లు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు.. కానీ మా కుటుంబానికి తెలుసునని కేటీఆర్ అన్నారు. నిర్వాసితులుగా మారితే... ఆ ఊరితో, ఆ ఇంటితో అల్లుకున్న జ్ఞాపకాలు మరిచిపోలేమన్నారు.

రిటర్న్స్ గురించి ప్రశ్నించిన కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 'రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్' ఎంత అని కాంగ్రెస్ ప్రశ్నించిందని, మరి మూసీ ప్రాజెక్టు వల్ల ఎంత వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ప్రయోజనం జరిగిందని, లక్షల ఎకరాలకు సాగునీరు అందిందన్నారు. మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. 2,400 కిలోమీటర్ల పొడువు ఉన్న గంగానది కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే, మూసీ నదికి రూ.1.50 లక్షల కోట్ల కేటాయించడం ఏమిటో చెప్పాలన్నారు. ఇది భారీ కుంభకోణం కాదా? అని నిలదీశారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారో చెప్పాలన్నారు.


More Telugu News