చార్మినార్‌లోనూ నాకు వాటా ఉందంటారేమో... కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీసులు పంపిస్తున్నా: హరీశ్ రావు

  • తనపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
తనకు ఎఫ్‌టీఎల్ పరిధిలోని కన్వెన్షన్‌లో వాటా ఉందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, అవసరమైతే గోల్కొండ కోట, చార్మినార్‌లోనూ తనకు వాటా ఉందని అంటారేమోనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్దపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌కు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. పరువు నష్టం దావాకు అనిల్ కుమార్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజాసమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వంపై వస్తోన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని అన్నారు. 

హిమాయత్ సాగర్‌లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఆనంద కన్వెన్షన్‌లో హరీశ్‌ రావుకు వాటాలు ఉన్నాయంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో వారు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని, ఆనంద కన్వెన్షన్‌లో హరీశ్ రావుకు వాటాలు ఉన్నాయని అనిల్ కుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు.


More Telugu News