బంకర్ బస్టర్ బాంబులు.. ఎలా పనిచేస్తాయంటే..!

  • నస్రల్లాను బంకర్ బస్టర్ లతో మట్టుబెట్టిన ఇజ్రాయెల్
  • భూగర్భంలోని బంకర్ లో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ పై దాడి
  • జీబీయూ 39, జీబీయూ 28 బాంబులను ప్రయోగించిన ఇజ్రాయెల్ వాయుసేన
ఇజ్రాయెల్ దాడులకు భయపడి అండర్ గ్రౌండ్ లోనే ఉంటున్న హిజ్బుల్లా చీఫ్ హనన్ నస్రల్లాను బంకర్ బస్టర్ బాంబులతో ఇజ్రాయెల్ వాయుసేన తుదముట్టించింది. అపార్ట్ మెంట్ కింద దుర్భేద్యంగా నిర్మించిన బంకర్ ను ఈ బాంబులు పేల్చేశాయి. భూమి లోపలకి చొచ్చుకెళ్లి పేలిపోవడంతో నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు చనిపోయారు. ఈ దాడికి ఇజ్రాయెల్ ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయి.. టార్గెట్ ను ఎలా ఛేదిస్తాయనే వివరాలు..

బంకర్ బస్టర్.. శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం భూమి పైన, భూగర్భంలో బంకర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు ఇలాంటి బంకర్లలోనే తలదాచుకుని ఇజ్రాయెల్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఇజ్రాయెల్ లోనూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం పలు బంకర్లను నిర్మించింది. వైమానిక దాడులను ముందుగా గుర్తించి సైరన్ మోగించడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ సైరన్ మోత వినిపించగానే జనం తమ దగ్గర్లోని బంకర్లలోకి, భూగర్భంలోని రైల్వే స్టేషన్లలోకి వెళ్లి బాంబు దాడుల నుంచి రక్షణ పొందుతారు.

కాంక్రీట్ తో పాటు ఉక్కును ఉపయోగించి ఈ బంకర్లను నిర్మిస్తారు. సాధారణ బాంబులు మీద పడినా ఈ బంకర్లు చెక్కుచెదరవు. హిజ్బుల్లా, హమాస్ సహా పలు తీవ్రవాద సంస్థలు తమ లీడర్లను కాపాడుకోవడానికి ఇలాంటి బంకర్లనే ఉపయోగిస్తున్నాయి. ఇలా బంకర్ లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగిస్తోంది. లెబనాన్ లో అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కున్న నస్రల్లాను ఈ బాంబులతోనే తుదముట్టించింది. 


ఈ బాంబులు ఎలా పనిచేస్తాయంటే...
సాధారణ క్షిపణులు టార్గెట్ పైన పడగానే పేలిపోతాయి. దీంతో చుట్టుపక్కల కొంతమేర విధ్వంసం జరుగుతుంది. నిర్మాణాలు కూలిపోతాయి. బంకర్ బస్టర్ బాంబులు నేల మీద పటిష్ఠంగా నిర్మించిన బంకర్ లలోకి చొచ్చుకెళ్లి ఆ తర్వాత పేలతాయి. భూగర్భంలోని బంకర్ లను టార్గెట్ చేస్తే.. భూమిని చీల్చుకుంటూ కొన్ని మీటర్ల లోపలికి చొచ్చుకువెళ్లి పేలిపోతాయి. దీంతో అండర్ గ్రౌండ్ బంకర్ లో దాక్కున్న వారంతా క్షణాలలో ప్రాణాలు కోల్పోతారు. భూమి లోపలికి దాదాపు 30 మీటర్లు చొచ్చుకెళ్లే సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఏకంగా ఆరు మీటర్ల మందంతో నిర్మించిన గోడను కూడా ఇవి చీల్చుకుంటూ వెళతాయి. ఈ బాంబులు ఒక్కోటీ టన్నుల కొద్దీ బరువుంటాయి. నస్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ వాడిన బంకర్ బస్టర్ బాంబుల పేరు జీబీయూ-39, జీబీయూ-28.. ఇవి అమెరికాలో తయారయ్యాయి. ఒక్కొక్కటీ టన్ను నుంచి రెండు టన్నుల బరువు ఉంటాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ బాంబుల వాడకంపై నిషేధం ఉంది. జెనీవా కన్వెన్షన్ లో ఇందుకోసం పలు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి.




More Telugu News