మిథున్ చ‌క్ర‌వ‌ర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

  • ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు మిథున్ ఎంపికైట్టు కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టన‌
  • అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో పుర‌స్కారం ప్ర‌దానం
  • ఈ నేప‌థ్యంలో 'ఎక్స్' వేదిక‌గా మంత్రి అశ్విని వైష్ణవ్ స్పెష‌ల్ పోస్ట్‌
భార‌తీయ సినిమాకు సంబంధించి అత్యున్న‌త పుర‌స్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిని వ‌రించింది. ఈ ఏడాది ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుకు ఆయ‌న ఎంపికైన‌ట్టు కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ తాజాగా ప్ర‌క‌టించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయ‌న‌ను ఈ అవార్డుతో సత్కరించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొంది.  

ఈ మేర‌కు మంత్రి అశ్విని వైష్ణవ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా ఈ వార్త‌ను పంచుకున్నారు. "మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ ఈ దిగ్గజ నటుడిని ఎంపిక చేసింద‌ని ప్రకటించడం గౌరవంగా ఉంది" అని ట్వీట్ చేశారు.

ఇక ఈ ఏడాది మిథున్‌ను ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు కూడా వ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సీనియ‌ర్ నటుడు 1976లో మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన 'మృగయా'తో తెరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి గాను ఆయ‌న‌ ఉత్తమ నటుడిగా తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును సైతం గెలుచుకున్నారు.

1980వ దశకంలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. 1979లో వ‌చ్చిన‌ స్పై థ్రిల్లర్ 'సురక్షా' చిత్రం ద్వారా ఆయ‌న‌ స్టార్‌డమ్ బాగా పెరిగింది. ఆ తర్వాత 'డిస్కో డాన్సర్', 'డ్యాన్స్ డ్యాన్స్', 'ప్యార్ ఝుక్తా నహీ', 'కసమ్ పైదా కర్నే వాలేకి', 'కమాండో' వంటి సూప‌ర్‌ హిట్స్ కొట్టారు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి.


More Telugu News