శోభన్ బాబుగారిపై చాలా కోపంగా ఉండేవాడిని: రేలంగి నరసింహారావు

  • శోభన్ బాబు సినిమా నుంచి తనని తీసేశారన్న రేలంగి  
  • దాంతో శోభన్ బాబుపై తనకు కోపం వచ్చిందని వెల్లడి 
  • ఆయన నిజం చెప్పడంతో బాధపడ్డానని వివరణ 
  • తర్వాత శోభన్ తో చేసిన 'సంసారం' మూవీ పెద్ద హిట్ అన్న రేలంగి 

తెలుగు ప్రేక్షకులకు కుటుంబకథా చిత్రాలను ఎక్కువగా అందించిన దర్శకుడు రేలంగి నరసింహారావు. కుటుంబ సంబంధమైన కథలకు హాస్యాన్ని అద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన కెరియర్లో ఎన్నో సక్సెస్ లు ఉన్నాయి. అలాంటి ఆయన తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలోనే ఆయన శోభన్ బాబును గురించి ప్రస్తావించారు. 

"శోభన్ బాబుగారు హీరోగా చేసే ఒక సినిమాకి దర్శకుడిగా నన్ను తీసుకున్నారు. 10 రోజులు కథా చర్చలు నడిచిన తరువాత ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తీసేశారు. దాసరి నారాయణరావుగారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న దగ్గర నుంచి నేను శోభన్ బాబుగారికి తెలుసు. అలాంటి ఆయనకి తెలియకుండా, డైరెక్టర్ ను మార్చే నిర్ణయం జరగదు. అందువలన ఆయనపై నాకు చాలా కోపం వచ్చేసింది. ఆ తరువాత నుంచి ఆయన షూటింగు ఎక్కడ జరుగుతున్నా, అక్కడి నుంచి తప్పుకుని వెళ్లిపోయేవాడిని" అన్నారు. 

"కొన్ని రోజుల తరువాత శోభన్ బాబుగారితో 'సంసారం' సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. నేను డైరెక్టర్ గా ఉండటం ఆయనకి ఇష్టమో లేదో కనుక్కుందామని ఇంటికి వెళ్లి కలిశాను. అసలు ఆ సినిమాకి నా పేరును సూచించింది ఆయనే అని తెలిసి షాక్ అయ్యాను. అంతకు ముందు సినిమా నుంచి నన్ను తప్పించడం నిర్మాత ఒత్తిడి వలన జరిగిందని శోభన్ బాబు చెప్పారు. ఆ నిర్మాతకి చెప్పినా వినిపించుకోకపోవడం వలన, మరో ప్రాజెక్టు ఇప్పించవచ్చనే ఉద్దేశంతో తాను అంగీకరించానని శోభన్ బాబు అన్నారు. ఆయనపై కోపం తెచ్చుకున్నందుకు నేను చాలా బాధపడ్డాను. తమ కాంబినేషన్లో వచ్చిన 'సంసారం' సూపర్ హిట్ అయింది" అని చెప్పారు. 



More Telugu News