అంబానీ ఇంట ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ అథ్లెట్లకు విందు.. నెట్టింట ఫొటోలు, వీడియోల వైర‌ల్‌!

  • పారిస్‌ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల‌ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌
  • ఒలింపిక్స్‌లో భార‌త్‌కు 6 ప‌త‌కాలు
  • పారాలింపిక్స్‌లో 29 మెడ‌ల్స్‌
  • ఆదివారం అంబానీ నివాసం యాంటీలియాలో అథ్లెట్ల‌కు నీతా అంబానీ ప్ర‌త్యేక విందు
ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించిన‌ విష‌యం తెలిసిందే. ఒలింపిక్స్‌లో 6 ప‌త‌కాలు, పారాలింపిక్స్‌లో ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా ఏకంగా 29 ప‌థ‌కాలు కొల్ల‌గొట్టారు ఇండియ‌న్ అథ్లెట్స్‌. 

ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అథ్లెట్ల‌ను త‌న ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఆదివారం రాత్రి ముంబయిలోని తమ నివాసం యాంటీలియాకు పిలిపించి మరీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఇందులో ఒలింపియ‌న్లు, పారాలింపియ‌న్లు ఒకేచోట క‌లిసి సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. దాదాపు 140 మంది వ‌ర‌కు అథ్లెట్లు ఈ ఈవెంట్‌కు హాజ‌రైన‌ట్లు స‌మాచారం. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. "ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. ఇండియాకు చెందిన‌ పారిస్ ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు మొదటిసారి ఒకే వేదికపై సమావేశమవుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ క్రీడ‌ల్లో వారు సాధించిన దానికి చాలా గర్విస్తున్నాం. భారతీయులందరూ ఈ రోజు వారిని గౌరవిస్తున్నారు. వారి పట్ల మనకున్న ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తున్నాం. 'యునైటెడ్ వి ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


More Telugu News