వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

  • ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్ – మాయిల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ కుమార్ సక్సేనా
  • దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన సీఎండీ అతుల్ భట్
  • విశాఖ ఉక్కు సీఎండీ పోస్టునకు ఇంటర్వ్యూలో ఎంపికైన శక్తిమణి
అజిత్ కుమార్ సక్సేనా విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (ఎంఓఐఎల్ – మాయిల్) చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి కాలం వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన అతుల్ భట్ పదవీ కాలం ఈ ఏడాది నవంబర్ 30వరకూ ఉన్నా, ఆయన రెండు నెలల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయనను దీర్ఘకాలిక సెలవుపై పంపినట్లుగా కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. 

అతుల్ భట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన నేపథ్యంలో అప్పటి నుండి ఉక్కు డైరెక్టర్ (కమర్షియల్) ఏకే బాగ్చీ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉక్కు సీఎండీ పోస్టునకు నిర్వహించిన ఇంటర్వ్యూలో శక్తిమణి ఎంపికయ్యారు. ఆయన డిసెంబర్ 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకూ ఏకే సక్సేనా సీఎండీగా వ్యవహరిస్తారు. మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసే ప్రదిపాదన చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


More Telugu News