శ్రీవారి సేవకు టికెట్ ఖరీదు రూ.కోటిన్నర.. దక్కించుకుంటే జన్మధన్యమే!

  • సుప్రభాతం నుంచి శ్రీవారు ఏకాంత సేవ దాకా అన్ని సేవల్లో పాల్గొనే అవకాశం
  • టికెట్ కొనుగోలు చేసిన వారితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు అనుమతి
  • వారంలో ఆరు రోజులు టికెట్ ఖరీదు రూ.కోటి.. శుక్రవారం మాత్రం కోటిన్నర
తిరుమలలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీహరికి నిత్యం ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు.. ఇందులో పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పిస్తోంది. ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారు స్వామి వారిని దగ్గర నుంచి కొలుచుకోవచ్చు. సర్వదర్శనం, దివ్య దర్శనాలతోపాటు నిత్య, వార పూజలు, సేవలలో ప్రత్యేకమైన, విశేషమైన సేవ ఒకటుంది. అదే ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ కు ఏకంగా రూ. కోటిన్నర వెచ్చించాల్సి ఉంటుంది. వారంలో ఆరు రోజులు రూ.కోటి ఉండే ఈ టికెట్ ఖరీదు శుక్రవారం మాత్రం రూ. కోటిన్నరగా టీటీడీ నిర్ణయించింది.

ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ పొందిన వారు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీనివాసుడి సకల వైభోగాలనూ తిలకించే భాగ్యం కలుగుతుంది. టికెట్ కొనుగోలు చేసిన వారితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులకు అనుమతి ఉంటుంది. ఏడాదికి ఓసారి స్వామి వారి నిత్య సేవల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఈ ఉదయాస్తమాన సేవ. ఈ సేవ టికెట్ ను దక్కించుకుంటే జన్మధన్యమైనట్టేనని భక్తులు అంటున్నారు.

1980 లలో ప్రారంభం..
ఉదయాస్తమాన సేవ టికెట్ ను టీటీడీ 1980 లలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీపద్మావతి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.కోటి ఆపైన విరాళాలు అందించే భక్తులకు ఈ టికెట్లను కేటాయిస్తూ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. మధ్యలో కొంతకాలం ఈ టికెట్ల జారీని నిలిపివేసిన టీటీడీ.. 2021 నుంచి మళ్లీ అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 347 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

సంస్థలకూ అవకాశం..
వ్యక్తులతో పాటు సంస్థలు కూడా ఈ టికెట్ కొనుగోలు చేసే వీలుంటుంది. ఏడాది పొడవునా ఏ రోజైనా ఎంచుకుని రోజంతా శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. ఒకసారి టికెట్ కొనుగోలు చేసిన వారు పాతికేళ్ల పాటు లేదా జీవితకాలం.. ఏది ముందైతే అందుకు తగ్గట్టుగా ఈ టికెట్‌ను వినియోగించుకోవచ్చు. సేవల్లో పాల్గొన్న తర్వాత స్వామికి అర్పించిన వస్త్రాలూ, ప్రసాదాలూ ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తుడికి అందిస్తారు. అయితే, శ్రీవారి సేవల్లో మార్పులతో ఎప్పుడైనా దర్శనాన్ని రద్దుచేసే హక్కు టీటీడీకి ఉంటుంది.


More Telugu News