చేనేత వస్త్రాలతో పండుగ చేద్దాం.. నేతన్నలకు అండగా ఉందాం: నారా భువనేశ్వరి

  • రాబోయే పండగ రోజుల్లో చేనేత వస్త్రాలు ధరించాలని కోరిన ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి 
  • నేతన్నల ఆనందంలో పాలుపంచుకోవాలని పిలుపు
  • ‘నిజం గెలవాలి’ యాత్ర సమయంలో నేతన్న కష్టాలను చూశానని వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు మద్దతుగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే పండగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి పనిచేసే వారి ఆనందంలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె వీడియో ప్రకటన విడుదల చేశారు.

‘‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. దసరా శుభాకాంక్షలు. ‘నిజం గెలవాలి’ యాత్ర సమయంలో నేను రాష్ట్రవ్యాప్తంగా తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలా మందిని కలిశాను. వాళ్లు పడే ఇబ్బందులు, కష్టాలను నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోని మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించి బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బ్లీచింగ్, యాసిడ్‌ల మధ్య నిలుచుని బట్ట నేస్తున్నవారి గురించి మనమందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ల బిడ్డల కోసం, వాళ్ల కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వస్త్రాలు నేస్తున్నారు. అందుకే మనందరం చేనేత కార్మికులకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి వారి ఆనందంలో మనం కూడా పాలుపంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి. మన సాంప్రదాయం’’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కాగా వచ్చే నెల అక్టోబర్‌లో దసరా, దీపావళి పండగలు ఉన్నాయన్న విషయం తెలిసిందే.


More Telugu News