ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు సమాచారం అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

  • కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్న సీఎం
  • కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు కార్డు వెనుక ఉండేలా చూడాలన్న సీఎం
  • ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలన్న సీఎం
కుటుంబ డిజిటల్ కార్డు కోసం బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించవలసిన పనిలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనుక ఉండేలా చూడాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించి అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పలో ఆయా రాష్ట్రాలు సేక‌రించిన వివ‌రాలు, కార్డుల‌తో క‌లిగే ప్రయోజ‌నాలు, లోపాల‌ను అధికారులు వివ‌రించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయం, ఇతర సంక్షేమ పథకాలలోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలన్నారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సమాచార సేకరణ, వాటిలో ఏయే వివరాలు పొందుపర్చాలి, అప్ డేట్‌కు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా సిద్ధం చేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలన్నారు. ఉపసంఘం సూచనల మేరకు సమగ్ర జాబితాను సిద్ధం చేసి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలన్నారు.


More Telugu News