తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయి... 50 లక్షల సభ్యత్వం కష్టమేమీ కాదు: జేపీ నడ్డా

  • 15 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని దిశానిర్దేశనం
  • అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని జేపీ నడ్డా సూచన
  • స్థానిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని సూచన
గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 77 లక్షల ఓట్లు రాగా, 8 ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. 77 లక్షల ఓట్లు వచ్చినప్పుడు రాష్ట్రంలో మనకు 50 లక్షల సభ్యత్వం కష్టమేమీ కాదన్నారు. బేగంపేటలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... పదిహేను రోజుల్లో నిర్దేశించుకున్న సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. 50 లక్షల టార్గెట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుమించి చేయాలన్నారు.

అన్ని వర్గాలను కలిసి సభ్యత్వం తీసుకోవాలని జేపీ నడ్డా సూచించారు. అత్యధిక సభ్యత్వం నమోదు చేయించిన వారికే పదవులు దక్కుతాయన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని, అప్పుడే ప్రజలు మన వైపు ఉంటారని హితబోధ చేశారు. ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో హైదరాబాదులో సమావేశమయ్యారు.


More Telugu News