ఆ ప్లాట్లు, ఇళ్లు టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రిజిస్ట్రేషన్ చేసినవే: హరీశ్ రావు

  • సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి వేలాదిమందిని నిరాశ్రయులుగా చేర్చారని ఆగ్రహం
  • 40 ఏళ్ల నుంచి జీవిస్తుంటే ఈరోజు వచ్చి నేలమట్టం చేస్తున్నారని మండిపాటు
  • ఒప్పించి ఇళ్లు ఖాళీ చేయించాలి తప్ప బెదిరించి కాదన్న హరీశ్ రావు
మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన ప్లాట్లు, ఇళ్లన్నీ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రిజిస్ట్రేషన్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇక్కడ నివసిస్తున్న వారి నుంచి ప్రభుత్వం నల్లా, కరెంట్ బిల్లులు కట్టించుకుంటోందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ నది సుందరీకరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాదిమందిని నిరాశ్రయులుగా చేస్తున్నారని మండిపడ్డారు.

నదీ పరివాహక ప్రాంతంలో 40 ఏళ్ల నుంచి జీవిస్తుంటే ఈరోజు వచ్చి నేలమట్టం చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో వేలమందిని నిరాశ్రయులను చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల ఇళ్లను తీసుకోవాలంటే నష్టపరిహారం చెల్లించి, కొత్త డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని వెల్లడించారు.

నిర్వాసితులను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించాలి తప్ప బెదిరింపులతో కాదని సూచించారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఇళ్లను కూలగొట్టే ప్రయత్నాలు చేయడం మూర్ఖత్వమన్నారు. ముఖ్యమంత్రిగా పేదలకు అండగా ఉండాలని, కానీ కన్నీళ్లు తెప్పించవద్దన్నారు. ఇళ్ల కూల్చివేతలతో ఈ రోజు లక్షలాది మందిని నిద్రపోనీయని స్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


More Telugu News