బుచ్చ‌మ్మ‌ది ప్ర‌భుత్వ హ‌త్యే.. 'హైడ్రా'పై హ‌రీశ్‌రావు మండిపాటు

  • రాష్ట్రంలో 'హైడ్రా' హైడ్రోజ‌న్ బాంబులా మారింద‌న్న మాజీ మంత్రి
  • తెలంగాణ భ‌వ‌న్‌లో హైడ్రా బాధితుల‌తో హ‌రీశ్‌రావు భేటీ
  • క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న ఇళ్ల‌ను రాత్రికి రాత్రే కూల్చేస్తే ఎలా? అంటూ ఫైర్‌
  • సీఎం రేవంత్ తుగ్ల‌క్ ప‌నులతో హైద‌రాబాద్ ఇమేజ్ దెబ్బ‌తింటోంద‌ని వ్యాఖ్య‌
బీఆర్ఎస్ కీల‌క నేత, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తాజాగా 'హైడ్రా'పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఈ సంస్థ హైడ్రోజ‌న్ బాంబులా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న ఇళ్లు కూల్చేస్తే ఎలా అని మండిప‌డ్డారు. కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన బుచ్చ‌మ్మ‌ది ఆత్మ‌హ‌త్య కాద‌ని, అది ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని అన్నారు. 

శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌కు వ‌చ్చిన హైడ్రా కూల్చివేత‌ల బాధితుల‌తో ఆయ‌న మాట్లాడారు. వారిని ప‌రామ‌ర్శించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సుంద‌రీక‌ర‌ణ పేరిట రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మూసీ న‌దిలో పేద‌ల ర‌క్తం, క‌న్నీళ్ల‌ను పారిస్తోంద‌ని ఫైర్ అయ్యారు. ఒక్కొక్క పైసా కూడ‌బెట్టి ఎంతో క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో క‌ట్టుకున్న ఇళ్ల‌ను రాత్రికి రాత్రే కూల్చేస్తే పేద‌లు ఎక్క‌డికి పోవాల‌ని ప్ర‌శ్నించారు. 

ఇక మూసీ నిర్వాసితురాలు బుచ్చ‌మ్మ‌ది ఆత్మ‌హ‌త్య కాదు, అది ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తుగ్ల‌క్ ప‌నుల కార‌ణంగా విశ్వ‌న‌గ‌రం హైద‌రాబాద్ ఇమేజ్ దెబ్బ‌తింటోంద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముందుగా వంద‌రోజుల్లోనే ఆరు హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పిన అంశంపై దృష్టిపెడితే బాగుంటుంద‌న్నారు. 

అఖిలప‌క్షాల‌తో మాట్లాడిన త‌ర్వాతే మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో కూల్చివేత‌ల‌పై స‌ర్కార్ ముందుకు వెళ్లాల‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో ఏనాడూ తాము ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌లేద‌ని గుర్తు చేశారు. మూసీ నిర్వాసితుల‌కు బీఆర్ఎస్ పార్టీ త‌ప్ప‌కుండా ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.


More Telugu News