విరాట్ కోహ్లీ కోసం సైకిల్‌పై బాలుడి 58కి.మీ ప్ర‌యాణం.. అయినా అత‌నికి నిరాశే!

  • కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ రెండో టెస్టు
  • 15 ఏళ్ల‌ కార్తికేయకు విరాట్ అంటే వీరాభిమానం
  • ఉన్నావ్‌లో ఉంటే అత‌డు.. కాన్పూర్‌కు 58కి.మీ సైకిల్ జర్నీ
  • వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కోహ్లీ బ్యాటింగ్ చూడ‌లేక నిరాశ‌
టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ చ‌రిష్మా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌పంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ర‌న్‌మెషిన్‌కు అభిమానులు ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడంటే చాలు స్టేడియంలో, టీవీల‌కు అభిమానులు అతుక్కుపోతుంటారు. ఎలాగైనా కోహ్లీ ఆట‌ను చూడాల‌నుకునే వీరాభిమానులు ఎంద‌రో ఉన్నారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన కార్తికేయకు కూడా విరాట్ అంటే వీరాభిమానం. దాంతో తాజాగా కోహ్లీని చూడటానికి 15ఏళ్ల  కార్తికేయ‌ పెద్ద సాహసమే చేశాడు. తన అభిమాన క్రికెటర్‌ను ఎలాగైనా చూడాల‌ని సైకిల్‌పై ఏకంగా 58 కి.మీ ప్రయాణించాడు. 

కాన్పూర్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ పార్క్‌లో శుక్రవారం ప్రారంభమైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు చూసేందుకు ఉన్నావ్ నుంచి ఇలా సైకిల్‌పై లాంగ్ జ‌ర్నీ చేసి మ‌రీ వచ్చాడు. ప్రస్తుతం కార్తికేయ తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న అత‌డు.. కాన్పూర్‌లో భార‌త్ టెస్టు మ్యాచ్ ఆడుతుండ‌డంతో త‌న అభిమాన క్రికెట‌ర్ విరాట్‌ను చూడాల‌నుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా సైకిల్‌పై తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు తన స్వ‌గ్రామం ఉన్నావ్ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ పార్క్‌కు బ‌య‌ల్దేరాడు. ఉదయం 11 గంటలకు స్టేడియానికి చేరుకున్నాడు. 

ఇలా 7 గంట‌ల సుదీర్ఘ సైకిల్‌ జ‌ర్నీ త‌ర్వాత స్టేడియం చేరుకున్న‌ కార్తికేయ‌కు నిరాశే ఎదురైంది. తొలిరోజు స‌గం ఆట కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కోహ్లీ బ్యాటింగ్ చూడాల‌నే కోరిక తీర‌లేదు. ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే.  

ఇక ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం క‌లిగించ‌డంతో తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్య‌మైంది. రెండో రోజు కూడా ఆట కొన‌సాగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో రెండు జ‌ట్ల‌ ఆట‌గాళ్లు స్టేడియం నుంచి తిరిగి హోట‌ల్‌కు వెళ్లిపోయారు.


More Telugu News