ఈ బిలియనీర్ కామాంధుడు... 60 మందిపై అత్యాచారం!

  • బ్రిటన్ కోర్టును ఆశ్రయించిన 60 మంది బాధిత మహిళలు
  • స్టోర్స్ అధినేతగా ఉన్న సమయంలో ఫయాద్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు
  • బాధితులు ఇంకా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించిన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు 
అతను ఒక బిలియనీర్..ఆయన తన సంస్థలో పని చేసిన అనేక మంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 60 మందికి పైగా మహిళలపై ఆయన అత్యాచారం చేశాడు. అయితే ఈ దారుణాలు అతను జీవించి ఉండగా వెలుగులోకి రాలేదు. గత ఏడాది అతను వయోభారం (94)తో ప్రాణాలు కోల్పోయాడు. 

ఆయన తన సంస్థలో పని చేసే అనేక మంది మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల బీబీసీ వార్తా సంస్థ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేయడంతో అతని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్‌లో ప్రముఖ లగ్జరీ డిపార్ట్ మెంట్ స్టోర్ హోరోడ్స్ సంస్థ మాజీ యజమాని మహ్మద్ అల్ ఫయాద్ ఈ దారుణాలకు ఒడిగట్టాడని, 1985 నుండి 2010 వరకూ అనేక దారుణాలు చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ కథనం రావడం తీవ్ర సంచలనం అయింది.

స్టోర్స్ అధినేతగా ఉన్న సమయంలో ఫయాద్ తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాదాపు 60 మంది మహిళలు బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందిస్తూ.. బాధితులు ఏవరైనా ఉంటే బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వీటిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు తమ వద్ద ప్రత్యేక బృందాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. 

ఈ కేసులకు సంబంధించి బ్రిటన్ కోర్టు విచారణ మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 60 మంది మహిళలు ముందుకు వచ్చారని, బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కాగా, ఈ పరిణామాలపై ప్రస్తుత హోరోడ్స్ యాజమాన్యం క్షమాపణలు తెలియజేసింది. ఫయాద్ కు సంబంధించిన లైంగిక ఆరోపణలు, నేర చరిత్ర గురించి అప్పట్లో తమకు తెలియదని సంస్థ ఎండీ మైఖేల్ వార్డ్ పేర్కొన్నారు.


More Telugu News