'హైడ్రా' భ‌యంతో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఏమ‌న్నారంటే..!

  • హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా జోరుగా హైడ్రా కూల్చివేత‌లు
  • కూల్చివేత‌ల భ‌యంతో గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య‌
  • కూతుళ్ల‌కు క‌ట్నంగా ఇచ్చిన ఇళ్లు కూల్చేస్తారేమోన‌న్న భ‌యంతో అఘాయిత్యం
  • ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న రంగ‌నాథ్‌
హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇల్లును రాసిచ్చారు. 

అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. 

స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్..
ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారని, దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుందని, ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

హైడ్రా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌లేద‌న్న రంగ‌నాథ్‌.. శివ‌య్య దంప‌తులు త‌మ కూతుళ్ల‌కు రాసిచ్చిన ఇళ్లు కూక‌ట్‌ప‌ల్లి చెరువుకు స‌మీపంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఎఫ్‌టీఎల్ ప‌రిధికి దూరంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇక కూల్చివేత‌ల‌కు సంబంధించి మూసీ ప‌రిధిలో చేప‌ట్టిన ఏ స‌ర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. 

మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.


More Telugu News