రాహుల్ గాంధీపై సైఫ్ అలీ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ధైర్యమున్న నాయకుడన్న బాలీవుడ్ స్టార్ నటుడు
విమర్శలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసని పొగడ్త
‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాహుల్ గాంధీ ధైర్యమున్న నాయకుడని, విమర్శలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలిసిన నేత అని కొనియాడాడు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ధైర్యం, నిజాయతీ ఉన్న ఈ రాజకీయ నాయకుడిని తాను ఇష్టపడతానని అన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వీరి ముగ్గురిలో భారత్‌ను భవిష్యత్తులోకి నడిపించగల ధైర్యమున్న రాజకీయవేత్త ఎవరని భావిస్తున్నారంటూ ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ముగ్గురూ ధైర్యవంతులేనని చెప్పిన సైఫ్... రాహుల్ గాంధీపై మాత్రం ప్రశంసల జల్లు కురిపించాడు. 

గతంలో అగౌరవ పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ రాహుల్ గాంధీ అధిగమించారని ప్రశంసించారు. ‘‘రాహుల్ గాంధీ విధానం చాలా ఆకట్టుకునేలా ఉందని నేను భావిస్తున్నాను. ఒకానొక సమయంలో రాహుల్ మాట్లాడిన మాటలను, ఆయన పనులను జనాలు అగౌరవ పరిచారు. కానీ ఆయన బాగా కష్టపడి పరిస్థితులను మార్చివేశారని భావిస్తున్నాను’’ అని సైఫ్ వ్యాఖ్యానించాడు. 

రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం తనకు లేదని సైఫ్ అలీఖాన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎవరికి మద్దతిస్తారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. 

‘‘నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. రాజకీయ నాయకుడు కావాలనే ఉద్దేశం లేదు. బలమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు మాత్రమే నేను ఒక పాత్రలోకి మారతాను. ఇక దేశం చాలా స్పష్టంగా మాట్లాడుతోందని నేను భావిస్తున్నాను. ఒక విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. పురోగమిస్తోంది’’ అని సైఫ్ వ్యాఖ్యానించాడు. 

కాగా, సైఫ్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


More Telugu News