నర్సాపూర్‌లో ఒకే కాలేజీకి చెందిన రెండు కాలేజీ బస్సుల ఢీ... ఒకరి మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు

  • ఆటోను తప్పించే ప్రయత్నంలో మరో బస్సును ఢీకొట్టిన వైనం
  • పటాన్‌చెరుకు చెందిన బస్సు డ్రైవర్ నాగరాజు మృతి
  • మరో డ్రైవర్ పరిస్థితి విషమం
  • నర్సాపూర్-సంగారెడ్డి రోడ్డుపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణలో రెండు కాలేజీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిందీ ఘటన. బస్సులు రెండూ బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)కి చెందినవే కావడం గమనార్హం. నగర శివారులోని క్లాసిక్ గార్డెన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

రెండు బస్సుల డ్రైవర్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. వారిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అతడిని పటాన్‌చెరుకు చెందిన నాగరాజుగా గుర్తించారు. మరో డ్రైవర్ యాదగిరి పరిస్థితి విషమంగా ఉంది. 

రెండు బస్సుల్లోని దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నుంచి రక్తం కారుతున్న విద్యార్థులను అంబులెన్సుల్లో హైదరాబాద్, నర్సాపూర్, సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించారు. 

ఆటోరిక్షాను తప్పించే ప్రయత్నంలో ఓ డ్రైవర్ బస్సును పక్కకి తిప్పడంతో మరో బస్సును ఢీకొట్టినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  ఈ ఘటనతో నర్సాపూర్-సంగారెడ్డి రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జేసీబీలతో బస్సులను అక్కడి నుంచి తొలగించారు.


More Telugu News