అలా క్రికెట్‌కు వీడ్కోలు.. ఇలా కేకేఆర్ మెంటార్‌గా డ్వేన్ బ్రావో

  • తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రావో
  • అలా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేకేఆర్‌ కీల‌క బాధ్య‌త‌లు
  • గౌతం గంభీర్ స్థానంలో బ్రావోను మెంటార్‌గా ఎంపిక చేసిన ఫ్రాంచైజీ
వెస్టిండీస్ స్టార్‌ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ విష‌యం తెలిసిందే. అలా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ క‌రేబియ‌ర్ స్టార్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. టీమ్ మెంటార్‌గా ఆయనను నియ‌మించింది. ఈ మేర‌కు తాజాగా ప్ర‌క‌ట‌న చేసింది. 2025 సీజ‌న్ నుంచి జ‌ట్టు మెంటార్‌గా డ్వేన్ బ్రావో బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. గౌతం గంభీర్ స్థానంలో బ్రావో మెంటార్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇటీవ‌ల టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపికవ‌డంతో ఆ పోస్టు ఖాళీ అయిన విష‌యం తెలిసిందే. 

ఇటీవ‌ల సీపీఎల్‌లో భాగంగా బ్రావోతో కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలోనే వెస్టిండీస్ స్టార్‌తో మెంటార్‌గా ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. "డ్వేన్ బ్రావో జట్టుతో చేర‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఆట‌లో అత‌నికి ఉన్న అనుభ‌వం, లోతైన అవ‌గాహ‌న మాకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌ప్ప‌కుండా మా జ‌ట్టుకు, ఆట‌గాళ్ల‌కు అత‌ని వ‌ల్ల మేలు జ‌రుగుతుంది" అని వెంకీ మైసూర్ తెలిపారు. 

ఇక కేకేఆర్‌ మెంటార్ ఎంపిక కావ‌డం ప‌ట్ల కూడా బ్రావో కూడా హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. "గ‌త 10 ఏళ్లుగా క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌)లో కోల్‌క‌తా ఫ్రాంచైజీ అయిన‌ ట్రిన్‌బాగో నైట్ రైడ‌ర్స్‌కు ఆడుతున్నా. అలాగే వేర్వేరు టీ20 లీగ్స్‌లో కేకేఆర్ పై ఆడిన అనుభ‌వం ఉంది. ఆట‌గాళ్ల‌తో యాజ‌మాన్యం ప్ర‌వ‌ర్తించే తీరుప‌ట్ల నాకు ఎంతో గౌర‌వం ఉంది" రాబోయే జ‌న‌రేష‌న్ ఆటగాళ్ల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి నాకు కేకేఆర్ సరైన వేదిక అని డ్వేన్ బ్రావో చెప్పుకొచ్చాడు. 

కాగా, 2011 నుంచి 2022 వ‌ర‌కు సీఎస్‌కేకు ఆడిన బ్రావో 2023లో ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. గ‌తేడాది చెన్నై టైటిల్ కూడా గెలిచింది. అలాగే ఈ ఏడాది టీ20 వ‌రల్డ్‌క‌ప్‌లో కూడా ఆఫ్ఘ‌నిస్థాన్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవ‌లు అందించాడు.  
       
ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు బ్రావో. ఓవ‌రాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో 500కి పైగా వికెట్ల‌తో టాప్‌లో నిలిచాడు.


More Telugu News