ఇక మాటల్లేవ్... చేతలే: నెతన్యాహు

  • హిజ్బుల్లాకు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని
  • అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను లెక్కచేయని వైనం
  • వారం రోజుల్లో నాలుగుసార్లు టార్గెటెడ్ దాడులు చేసినట్లు వెల్లడి
ఇజ్రాయెల్ భూభాగంపైన, ఇజ్రాయెల్ పౌరులపైన దాడులు చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చాలాసార్లు స్పష్టం చేశారు. తాజాగా లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా తీవ్రవాదులను మట్టుబెట్టడానికి వైమానిక దాడులు చేస్తున్నట్లు చెప్పారు. ఇకపై మాటల్లేవు చేతలే వారికి జవాబు చెబుతాయని తాజాగా వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా ప్రతిపాదించిన 21 రోజుల కాల్పుల విరమణను నెతన్యాహు లెక్కచేయలేదు. మరింత తీవ్రమైన దాడులు చేయాలని తన బలగాలను ఆదేశించారు. లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

గడిచిన వారం రోజుల్లో హిజ్బుల్లా లీడర్లను టార్గెట్ చేసి నాలుగుసార్లు వైమానిక దాడులు చేశామని, ఆ సంస్థకు చెందిన కీలక నేతలను మట్టుబెట్టామని వివరించారు. గురువారం జరిపిన దాడిలో హిజ్బుల్లా ఎయిర్ యూనిట్ కమాండర్ మహ్మద్ హుస్సేన్ స్రుర్ ను చంపేశామని నెతన్యాహు చెప్పారు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు క్షేమంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకునేలా చూడడమే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని, హిజ్బుల్లాపై దాడులు ఆపేదే లేదని స్పష్టం చేశారు. ఇకపై మాటలు కాదు చేతలే హిజ్బుల్లాకు జవాబుచెబుతాయని నెతన్యాహు ట్వీట్ చేశారు.


More Telugu News