ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్

  • కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంట‌నే ప‌రారీ
  • ఈ నెల 11న వెంక‌టరెడ్డిపై కేసు న‌మోదు
  • హైదరాబాద్‌లో అదుపులోకి
  • ధ్రువీకరించిన ఏసీబీ అధికారులు
  • నేడు విజయ‌వాడ కోర్టుకు ఏపీఎండీసీ మాజీ ఎండీ
ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ‌ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొన్ని రోజుల త‌ర్వాత ప‌రారైన ఆయ‌న 3 నెల‌లుగా త‌ప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

గ‌నుల శాఖ‌లో టెండ‌ర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధ‌న‌లు, ఇసుక త‌వ్వ‌కాల్లో భారీ మొత్తంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగాల‌పై కొన్నాళ్ల కింద‌ట రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను స‌స్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించగా వెంకట రెడ్డి క‌నిపించ‌కుండా పోయారు. దీంతో ఆయ‌న‌పై ఈ నెల 11న ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న‌ ఏసీబీ బృందాల‌కు ఎట్ట‌కేల‌కు ఆయన హైద‌రాబాద్‌లో చిక్కారు. 

ఇక వెంక‌ట రెడ్డి మునుప‌టి వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో తీసుకున్న‌ చర్యల వల్ల రూ. 2,566 కోట్ల మేర ప్ర‌భుత్వ‌ ఆదాయానికి గండి పడిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇసుక గుత్తేదారు సంస్థ‌లైన జ‌య‌ప్ర‌కాశ్ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ లిమిటెడ్, జీసీకేసీ, ప్ర‌తిమ సంస్థ‌లు, మ‌రికొంద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి రూ. వేల కోట్లు కొల్ల‌గొట్టేందుకు ఆయ‌న నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డ్డార‌ని ఏసీబీ తేల్చింది.

సుప్రీంకోర్టు, జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ ఆదేశాల‌ను సైతం తుంగ‌లో తొక్కి త‌ప్పుడు అఫిడ‌విట్లు స‌మ‌ర్పించిన‌ట్లు గుర్తించింది. ఈ నేప‌థ్యంలో కీల‌క ఆధారాలు ల‌భించ‌డంతో వెంకట రెడ్డిని అరెస్టు చేయ‌డం జ‌రిగింది. 

వెంకట రెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేష‌న్‌పై వ‌చ్చారు. ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌లో సీనియ‌ర్ సివిలియ‌న్ స్టాఫ్ ఆఫీస‌రైన ఆయ‌న తొలుత విద్యాశాఖ‌లో బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత 2020 ప్రారంభంలో గ‌నుల‌శాఖ సంచాల‌కుడిగా నియ‌మితుల‌య్యారు. ఆ త‌ర్వాత కొంత కాలానికి ఏపీఎండీసీకి ఎండీగానూ అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ రెండు పోస్టుల ద్వారా వైసీపీ హ‌యాంలో అడ్డ‌గోలు దందాల‌కు తెర‌లేపారు. 

2014-19 మ‌ధ్య టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అమ‌లు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, దీనికి అప్ప‌టి సీఎం చంద్ర‌బాబును బాధ్యుడిని చేస్తూ ఆయ‌న‌పై సీఐడీలో అక్ర‌మంగా కేసు కూడా న‌మోదు చేయించారు.


More Telugu News