ఆస్ట్రేలియా వెళ్లే భార‌తీయ యువ‌త‌కు గుడ్‌న్యూస్.. ఏటా 1000 వ‌ర్క్‌, హాలిడే వీసాలు

  • ఇరు దేశాల మ‌ధ్య‌ ఆర్థిక‌, వాణిజ్య స‌హ‌కార ఒప్పందం (ఏఐ-ఈసీటీఏ)
  • ఈ ఒప్పందం ప్ర‌కారం ఆస్ట్రేలియాలో ఉపాధి, చ‌దువు, ప‌ర్య‌ట‌న కోసం ఏడాది పాటు ఉండేందుకు వీలుగా వీసా జారీ 
  • ఈ వీసా కోసం 18 నుంచి 30 ఏళ్ల భార‌తీయ యువ‌త‌ ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అర్హులు
  • ఈ ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ప్రారంభం
  • వీసా వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి పీయూష్ గోయ‌ల్
ఇరు దేశాలు చేసుకున్న ఆర్థిక‌, వాణిజ్య స‌హ‌కార ఒప్పందం (ఏఐ-ఈసీటీఏ)లో భాగంగా భార‌తీయుల‌కు ఆస్ట్రేలియా ఏటా 1000 వ‌ర్క్, హాలిడే వీసాల‌ను అందించ‌నుంది. ఈ ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఆస్ట్రేలియా, ఇండియా మ‌ధ్య కుదుర్చుకున్న ఈసీటీఏ ఒప్పందం డిసెంబ‌ర్ 2002 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. 

ఇక ఈ ఒప్పందం ప్ర‌కారం ఆస్ట్రేలియాలో ఉపాధి, చ‌దువు, ప‌ర్య‌ట‌న కోసం ఏడాది పాటు ఉండేందుకు వీలుగా ఈ వీసా జారీ చేయడం జ‌రుగుతుంది. ఈ వీసా కోసం 18 నుంచి 30 ఏళ్ల వయసున్న భార‌తీయ పౌరులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్క‌డి వివిధ ప్రాంతాల్లో స్థానిక నిబంధ‌న‌ల‌కు లోబ‌డి తాత్కాలిక నివాసం ఉండేందుకు ఏటా 1000 వీసాలను ఆస్ట్రేలియా స‌ర్కార్ జారీ చేస్తుంది. 

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ ఈ నెల 23 నుంచి 26 వ‌ర‌కు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియా-ఇండియా ఆర్థిక స‌హ‌కారం, వాణిజ్య ఒప్పందం (ఏఐ-ఈసీటీఏ)లో కీల‌క‌మైన వ‌ర్క్‌, హాలిడే వీసా కార్య‌క్ర‌మం అక్టోబ‌ర్ 1, 2024 నుంచి ప్రారంభం కానుంద‌ని చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఇది రెండు దేశాల మ‌ధ్య రాక‌పోక‌లు, ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు దోహ‌దం చేస్తుంది" అన్నారు.


More Telugu News